Saturday, March 20, 2010

విలీనం ద్వారా సిమెంట్ విస్తరణ

సిమెంట్ నుంచి వైదొలిగే ఆలోచనే రెయిన్‌కు లేదని కంపెనీ వైస్‌ప్రెసిడెంట్ (ఫైనాన్స్) శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 30 లక్షల టన్నులున్న సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కనీసం 60 లక్షల టన్నులకు పెంచుకోవాలన్నది కంపెనీ యోచన.

ఇప్పటికే పెద్ద సంఖ్యలో కొత్త సిమెంట్ ప్లాంట్లు ఏర్పాటైన కారణంగా, మళ్లీ కొత్త ప్లాంట్ ఏర్పాటు జోలికి పోకుండా ఇనార్గానిక్ గ్రోత్ అంటే ఇప్పటికే వ్యాపారంలో ఉన్న సంస్థలను విలీనం చేసుకుని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తున్నది. సిమెంట్‌ను విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయడం వల్ల జాయింట్ వెంచర్ భాగస్వాములను చేర్చుకోవడం తేలిక అవుతుందని శ్రీనివాసరావు వివరించారు.

జెవిలో మెజార్టీ షేరు రెయిన్‌కే ఉంటుందని ఆయన అన్నారు. విద్యుత్ కొరత వల్ల సిమెంట్ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నా కాపిటివ్ ప్లాంట్ ఉన్న కారణంగా తమకు ఇబ్బందులు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా రెయిన్ సిమెంట్ వ్యాపారంలో భాగస్వామ్యానికి విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.