ఐదేళ్లలో రూ.60,000 కోట్లకు.. భారత సినీ, టీవీ పరిశ్రమ
భారత సినీ, టీవీ పరిశ్రమ స్థాయిపై
ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ నివేదిక
న్యూఢిల్లీ: అంతకంతకు పెరుగుతున్న ప్రేక్షకులకు విస్తరిస్తున్న అంతర్జాతీయ చలనచిత్రాల మార్కెట్ పరిధి తోడై, భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ రానున్న అయిదు సంవత్సరాల్లో రూ.60,000 కోట్లకు పైగా ఎదగడానికి దోహదం చేయనున్నాయని ఒక అధ్యయనం పేర్కొంది. 'ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ' అనే పేరుతో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌వెలువరించిన నివేదికలో గత ఆర్థిక సంవత్సరం (2008-09)లో భారతీయ ఫిలిం, టీవీ పరిశ్రమ ఉమ్మడి ఆదాయాలు రూ.35,000 కోట్లకు పైబడ్డట్లు వివరించారు. నివేదికను మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ఛైర్మన్ డాన్ గ్లిక్‌మన్ విడుదల చేశారు. ఈ పరిశ్రమ దేశంలో సుఏమారు 18 లక్షల ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు రూ.28,305 కోట్లను సమకూర్చినట్లు తెలిపారు. కాపీరైట్ చౌర్యం పెద్ద బెడదగా మారి చలనచిత్రాల ఆర్జన స్తోమతను దెబ్బతీస్తోందని, దీంతో కొత్త చిత్రాలకు పెట్టుబడుల లభ్యతతో పాటు నూతన ఉద్యోగ అవకాశాల సృష్టిపైన కూడా దీని వ్యతిరేక ప్రభావం కనపడుతుందని ఆయన అన్నారు. పైరసీ కారణంగా 2008లో భారతీయ చలనచిత్ర పరిశ్రమ 959 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,364 కోట్లు), 5.71లక్షల కొలువులను కోల్పోయిందని యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అధ్యయనం తేల్చిందన్నారు. సినిమా థియేటర్లలో క్యాంకార్డర్లను ఉపయోగించడమే వీడియో చౌర్యానికి ప్రధాన కారణం అవుతోందని, దీనిని అరికట్టడానికి పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని గ్లిక్‌మన్ అభిప్రాయపడ్డారు. టైమ్ వార్నర్ సీనియర్ ఉపాధ్యక్షుడు హ్యూ స్టీఫెన్స్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా పరిశ్రమ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని, రానున్న కాలంలోనూ ఇదే సరళి కొనసాగనుందన్నారు. భారత మార్కెట్‌లో మీడియా, వినోద రంగాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని టైమ్ వార్నర్ కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.