శంకర్ శర్మపై ఏడాది నిషేధం
సెబీ ఉత్తర్వులకు శాట్ సమర్థన
ముంబయి: సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధిస్తూ సెబీ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఫస్ట్ గ్లోబల్ వైస్ ఛైర్మన్, సంయుక్త ఎండీ శంకర్ శర్మ పిటిషన్‌ను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్(శాట్) శుక్రవారం కొట్టిపారేసింది. తక్షణం అమల్లోకి వచ్చేలా శర్మను ఒక ఏడాది పాటు మార్కెట్‌లో ట్రేడింగ్ జరపకుండా నిషేధం విధించింది. గతేడాది ఫిబ్రవరిలో కొన్ని స్క్రిప్‌ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల మీద ఆయన్ను మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. 'శంకర్ పిటిషన్‌ను కొట్టిపారేస్తున్నాం. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంద'ని జస్టిస్ ఎన్.కె. సోధి అంటున్నారు. పూర్తి వివరాలతో ఒక వారంలోగా శాట్ ఆదేశాలను జారీచేస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది నవంబరులో రికార్డుల్లో కొన్ని లోపాలున్నాయంటూ శర్మ సెబీ ఆర్డరును సవాలు చేస్తూ శాట్ ఎదుటకు వెళ్లారు.