Saturday, March 20, 2010

పిఎస్‌యు బ్యాంకులకు 9,000 కోట్లు

ఏప్రిల్-మే నెలలో అందజేత
బ్యాంకుల ఎంపికకు ప్రభుత్వం కసరత్తు

ముంబై: వచ్చే నెల రోజుల్లో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు అదనపు మూలధనం సమకూరునుంది. బడ్జెట్‌లో ప్రకటించిన మూలధనీకరణ ప్రణాళిక మేరకు ఏప్రిల్- మే నెల మధ్యకాలంలో కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ ఆర్ గోపాలన్ శుక్రవారంనాడు పాత్రికేయులకు తెలిపారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల పునర్‌మూలధనీకరణకుగాను ప్రభుత్వం బడ్జెట్‌లో 16,500 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులు 2011 మార్చి31 నాటికి ఎనిమిది శాతం టైర్ వన్ మూలధనాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది.

కాగా ఏయే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎంతమొత్తంలో మొదటి విడతగా ఇచ్చే 9,000 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తాము ఇదే పనిలో ఉన్నట్లు గోపాలన్ తెలిపారు. కాగా పునర్ మూలధనాన్ని పొందే బ్యాంకుల పేర్లను వెల్లడించడానికి గోపాలన్ విముఖ చూపారు.

కాగా యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, దేనా బ్యాంక్‌లు తొలి విడత మూలధనాన్ని పొందే బ్యాంకుల జాబితాలో ఉండే అవకాశం ఉందని సమాచారం.

బ్యాంకులు మూలధనాన్ని సమకూర్చే విషయానికి సంబంధించి గోపాలన్ శుక్రవారంనాడు ఆర్‌బిఐ గవర్నర్ డి సుబ్బారావు, డిప్యూటీ గవర్నర్లు, ఎస్‌బిఐ చైర్మన్ ఒపి భట్, యూనియన్ బ్యాంక్ చీఫ్ ఎంవి నాయర్, యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ నందన్ నిలేకనిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన కొత్త టెక్నాలజీ గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోలేని ప్రాంతాలకు ఈ సర్వీసులను విస్తరించడానికి అటుప్రభుత్వం ఇటు ఆర్‌బిఐ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు గోపాలన్ తెలిపారు. 2,000లకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు సైతం బ్యాంకింగ్ సర్వీసులను తీసుకువెళతామని , ఇలాంటివి 60,000 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినట్లు ఆయన చెప్పారు. 2012 నాటికి తమ లక్ష్యాన్ని సాధించే అవకాశంఉందని ఆయన తెలిపారు.