Saturday, March 20, 2010

వెనెజులా చమురుక్షేత్రంలో పెట్టుబడులకు పచ్చజెండా

ఓఎన్‌జీసీ వాటా 5 ఏళ్లలో రూ.6132 కోట్లు
ఐఓసీ, ఓఐ చెరి రూ.2089 కోట్లు
దేశానికి ఏటా 36 లక్షల టన్నుల ముడిచమురు
సీసీఈఏ నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశానికి ఏటా 36 లక్షల టన్నుల ముడిచమురు లభించనుంది. ఇందుకోసం వెనెజులా దేశంలో చమురుక్షేత్రం అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ఓఎన్‌జీసీతో పాటు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) , ఆయిల్‌ ఇండియా (ఓఐ)లను కేంద్రప్రభుత్వం అనుమతించింది. ఆర్థిక వ్యవహారాలపై నియమించిన మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) తీసుకున్న నిర్ణయాలను హోంశాఖ మంత్రి చిదంబరం విలేకరులకు వెల్లడించారు. వెనెజులాలోని 'కారబోబో-1' చమురుక్షేత్రం అభివృద్ధిప్రాజెక్టును వెనెజులా ప్రభుత్వరంగ సంస్థ పీడీవీతో పాటు స్పెయిన్‌కు చెందిన రెప్సోల్‌-వైపీఎఫ్‌, మలేసియాకు చెందిన పెట్రోనాస్‌తో కలిసి భారత సంస్థలు పొందాయి. 2010-15 మధ్య కాలంలో ఓఎన్‌జీసీ అనుబంధ ఓన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవిఎల్‌), ఐఓసీ, ఓఐ కలిపి రూ.10,032.6 కోట్లు పెట్టుబడి పెడతాయి. ఇందులో ఓవీఎల్‌ వాటా రూ.6132 కోట్లు అయితే, ఐఓసీ, ఓఐ చెరి రూ.2089 కోట్లు. కొత్త అన్వేషణ, అనుమతి విధానం(ఎన్‌ఈఎల్‌పీ)లో భాగంగా 33 బ్లాక్‌లకు బిడ్లను సీసీఈఏ ఆమోదించింది. వీటిలో 17 బ్లాకులను ఓఎన్‌జీసీ దక్కించుకుంది. మొత్తం 70 బ్లాకులకు బిడ్‌లు ఆహ్వానించగా, 36కు మాత్రమే అందాయి. అసోంలోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌కు చెందిన నామరూప్‌ ప్రాజెక్టు పునర్వ్యవస్థీకరణకు రూ.635 కోట్లు అందించేందుకు మంత్రివర్గ సంఘం ఆమోదించినట్లు చిదంబరం తెలిపారు. ఈశాన్య భారతంలో యూరియా కొరత రాకుండా ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. నేషనల్‌ జూట్‌ మ్యానుఫాక్చర్స్‌ కార్పొరేషన్‌ ఆధీనంలోని 3 జనపనార మిల్లుల పునరుద్ధరణకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా వూపింది.