వాషింగ్టన్: భారత దేశానికి చెందిన వృత్తి నిపుణులకు వీసా నియమ నిబంధనలను సరళతరం చేయాలని అమెరికాను ఇండియా కోరింది. భారత కంపెనీలు, అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) భారతీయ వృత్తి నిపుణులకు యూఎస్ వీసాలను సంపాయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యక్షుడు ఒబామా పాలనాయంత్రాంగం అధికారులతో సూటిగా చర్చించినట్లు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. వాషింగ్టన్‌లో మూడు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, భారతీయులు అమెరికాలో.. ఆ మాటకొస్తే యూరప్‌లోనూ.. ఉపాధి అవకాశాలను, సంపదను సృష్టించడంలో కీలకం అవుతున్నారన్నారు. అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులైన వృత్తి ప్రవీణులు మింగేస్తున్నారన్న వాదన 'సరి కాద'ని, రెండు దేశాలూ పరస్పరం లాభపడుతున్నాయన్నారు. భారత్ సేవల నికర దిగుమతిదారు పాత్రనూ పోషిస్తోందని, ఇటీవలే ఐబీఎమ్‌కు భారతీ గ్రూపు 2.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11,500 కోట్ల) కాంట్రాక్టు ఇచ్చిందని ప్రస్తావించారు. భారతీయ కంపెనీలు అమెరికాకు అందిస్తున్న సేవలపై మరింత చైతన్యం పెంపొందాల్సిన అవసరం ఉందని అమెరికా పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ఛైర్మన్‌లు, సీఈఓలే అభిప్రాయపడ్డారన్నారు. పెట్టుబడులపై అధిక ప్రతిఫలాల వాగ్దానంతో భారతదేశం అమెరికా కార్పొరేట్లకు అపరిమిత అవకాశాలను ఇవ్వజూపుతోందని ఆనంద్ శర్మ అన్నారు. మరీ ముఖ్యంగా వస్తూత్పత్తి, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఇందుకు చక్కని అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన అమెరికా, భారత పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ భారత్‌ను వస్తూత్పత్తి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొత్త విదేశీ పెట్టుబడి విధాన పత్రాన్ని ఈ నెల 31న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఎగుమతుల విషయంలో ఉన్న నియంత్రణలను సడలించాలని ఒబామా ప్రభుత్వానికి శర్మ విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడు ఒబామా జూన్‌లో, లేదా సెప్టెంబరులో భారత్ సందర్శించే అవకాశం ఉందని అమెరికాలో భారత రాయబారి అయిన మీరా శంకర్ అన్నారు.