Saturday, March 20, 2010

ఎల్‌జీ ఉత్పత్తులు ప్రియం

విపణిలోకి కొత్త ఫ్రిజ్‌లు
ఈ ఏడాది వ్యాపార లక్ష్యం రూ.19,000 కోట్లు
ఎల్‌సీడీ, మొబైల్‌ ఫోన్ల మార్కెట్‌పై దృష్టి
త్వరలో 3డీ టెలివిజన్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: టెలివిజన్లు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలను ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా పెంచనుంది. ఇటీవలే ధరలను 3 శాతం పెంచిన కంపెనీ వచ్చే నెల్లో మరో 3.5 శాతం వరకు పెంచే వీలుంది. ఎక్సైజ్‌ సుంకం, పెట్రో ఉత్పత్తులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తుల ధరలను పెంచక తప్పడం లేదని ఎల్‌జీ వ్యాపార అధిపతి (గృహోపకరణాలు) రాజీవ్‌ జైన్‌ తెలిపారు. డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్ల విభాగంలో కొత్తగా 23 రకాలను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది (2009) ఈ విభాగంలో కంపెనీకి 26.4 శాతం మార్కెట్‌ వాటా ఉండగా.. కొత్త రకాలతో ఈ ఏడాది 28 శాతానికి పెరగనుందని ఎల్‌జీ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) వై.వి.వర్మ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్రిజ్‌లకు 5 నక్షత్రాల రేటింగ్‌ ఉందని, వీటి ధర రూ.11,500 నుంచి రూ.15,500 మధ్య ఉంటుందని అన్నారు. 2010లో మొత్తం ఫ్రిజ్‌ల అమ్మకాలు (డైరెక్ట్‌ కూల్‌, ఫ్రాస్ట్‌ ఫ్రీ) అమ్మకాలు రూ.3,000 కోట్లకు చేరతాయని ఆశిస్తున్నామన్నారు.

ఎల్‌సీడీ విపణిలో 35% వాటాపై కన్ను: ఎల్‌సీడీ టెలివిజన్ల మార్కెట్‌లో ఈ ఏడాది చివరకు అగ్రస్థానం దక్కించుకోవాలని ఎల్‌జీ భావిస్తోంది. కొత్తగా 25 మోడళ్లను విడుదల చేయనుంది. విలువ ఆధారంగా ఎల్‌సీడీ విపణిలో కంపెనీకి ప్రస్తుతం 30 శాతం వాటా ఉండగా.. దీన్ని 35 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు మూడు నెలల్లో 3డీ టెలివిజన్‌ను కూడా ఎల్‌జీ విడుదల చేయనుంది. ప్రారంభంలో ఈ టెలివిజన్‌ ధర సాధారణ టీవీ కన్నా 30-40 శాతం అధికంగా ఉండవచ్చని వర్మ తెలిపారు. 3-4 మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్‌ మార్కెట్‌పైనా కంపెనీ దృష్టి కేంద్రీకరించనుందని చెప్పారు.

అమ్మకాల్లో 45% వృద్ధి లక్ష్యం
ప్రస్తుత ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.19 వేల కోట్లకు చేరగలవని కంపెనీ అంచనా వేస్తోంది. గత ఏడాది (2009) అమ్మకాలు రూ.13,089 కోట్లతో పోలిస్తే ఇది 45 శాతం అధికం. 2008లో విక్రయాలు రూ.10,730 కోట్లు మాత్రమే. గత ఏడాది ప్రకటనలపై రూ.550 కోట్లు ఖర్చు చేయగా.. ఈ సారి దీన్ని రూ.750 కోట్లకు పెంచారు.