Saturday, March 20, 2010

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గనున్న బియ్యం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం బియ్యం ధర బాగా తగ్గే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. బియ్యం అత్యధిక స్థాయిలో వినియోగించే భారత్‌లో అవసరానికి సరిపడినంత ఆహార ధాన్యాలు ఉంటాయని, దీంతో బియ్యం దిగుమతి చేసుకునే అవసరం ఆ దేశానికి ఉండకపోవచ్చునని, ఇది అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరపై ప్రభావం చూపిస్తుందని స్టాన్‌చార్ట్ పేర్కొంది.

అంతేకాకుండా ఆసియా, ఉత్తర అమెరికాలలో ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు మరీ ముఖ్యంగా గోధుమ దిగుబడి ఈ ఏడాది హెచ్చు స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున బియ్య ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని తన తాజా నివేదికలో తెలిపింది. ఇప్పటికే జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు 20 శాతం తగ్గాయి.

ప్రపంచ మొత్తం మీద అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు థాయిలాండ్‌లో బియ్యం హోల్‌సేల్ ధరలు గత 10 వారాల్లో 10 శాతానికి పైగా తగ్గాయి. భారత్‌లో కొంత మేర ఖరీఫ్‌లో వరి దిగుబడి తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలపై ఈ ప్రభావం పెద్దగా ఉండదని ఆ నివేదికలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీజన్‌లోబియ్యం దిగుబడి 44.03కోట్ల టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.